Hot Posts

6/recent/ticker-posts

నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్ సిద్దం: తొలిగా తిరుపతికి ప్రత్యేక రైలు, షెడ్యూల్..!!


నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్ సిద్దం: తొలిగా తిరుపతికి ప్రత్యేక రైలు, షెడ్యూల్..!!

తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చింది. ఎంతో కాలంగా ఈ రైల్వే లైన్ కోసం రెండు రాష్ట్రాల ప్రజలు వేచి చూస్తున్నారు. సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఇప్పుడు నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టు మార్గంలో న్యూ పిడుగురాళ్ల - శావల్యాపురం మధ్య తొలిసారి ప్రయాణికు ల రైలు పరుగులు పెట్టనుంది. ఈ రైలు మార్గం నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు గూడ్స్‌ రైళ్లను మాత్రమే నడుపుతున్నారు. దీని ద్వారా ఏపీ, తెలంగాణ నుంచి దక్షిణాది నగరాలకు మరో రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది.

ఎన్నో కల ఫలించింది. తెలుగు రాష్ట్రాల నుంచి దక్షిణాది నగరాలకు వెళ్లేందుకు వీలుగా మూడో రైల్వే లైన్ అందుబాటులోకి తీసుకొస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో కీలకమైన నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టు మార్గంలో న్యూ పిడుగురాళ్ల - శావల్యాపురం మధ్య తొలిసారి ప్రయాణికుల రైలు పరుగులు పెట్టనుంది. ఈ రైలు మార్గం నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు గూడ్స్‌ రైళ్లను మాత్రమే నడుపుతున్నారు. ఇక, జూలై 4వ తేదీ నుంచి ప్రయాణీకుల రైళ్లు పట్టాలెక్కనున్నాయి. తొలిగా నాందేడ్ నుంచి తిరుపతి వెళ్లే ప్రత్యేక రైలును ఈ మార్గం నుంచి నడపాలని అధికారులు నిర్ణయించారు. జులై 4వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రతి శుక్రవారం ఈ రైలు నడవనుంది.

జూలై 4వ తేదీ మహారాష్ట్ర నాందేడ్‌లో సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు (07189) పల్నాడు జిల్లాలో నడికుడికి రాత్రి 12.05, పిడుగురాళ్లకి రాత్రి 12.30, నెమలపురికి రాత్రి 01.00, రొంపిచర్లకి రాత్రి 01.25, వినుకొండకు 02.00 గంటలకు చేరుతుంది. మార్కాపురం, దొనకొండ, కంభం, నంద్యాల మీదుగా తిరుపతికి శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు రైలు వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07190) తిరుపతిలో జులై 5వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి వినుకొండకు రాత్రి 10.05కు, రొంపిచర్ల 10.25కు, నెమలిపురి 10.35కు, పిడుగురాళ్ల 10.45కు, నడికుడి 11.00కి, నాందేడ్‌కు ఆదివారం ఉదయం 09.30 గంటలకు చేరుతుంది.

కొత్తగా ప్రారంభిస్తున్న ఈ నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే మార్గం కీలకం కానుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ప్రజల రాకపోకలకు ఈ రైలు మార్గం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. విజయ వాడ - చెన్నై రైల్వే మార్గానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడనుంది. రానున్న రోజుల్లో తిరుపతి కి వెళ్లే రైళ్లను కొన్నింటిని ఈ మార్గం మీదుగా మళ్లించేలా కసరత్తు జరుగుతోంది. ఏ రైళ్లను ఈ మార్గంలో కొనసాగించాలనే అంశం పైన కసరత్తు జరుగుతోంది. ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత అధికారులు ప్రకటన చేయనున్నారు.