Hot Posts

6/recent/ticker-posts

జనవరి 26 నుంచి ప్రభుత్వ పథకాల జాతర: భట్టి విక్రమార్క


TELANGANA ఖమ్మం: తెలంగాణలో జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ మొదలవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. By Posted BCN TV.. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎలాంటి షరతులు లేకుండా ఎకరానికి రూ.12 వేలు ఇవ్వబోతున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి రూ.12 వేలు ఇవ్వనున్నట్లు భట్టి చెప్పారు. ఖమ్మం జిల్లా బనిగండ్లపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామంలో రూ.1.56 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అలాగే అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన గోదాములను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. పలు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన డిప్యూటీ సీఎం భట్టికి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పూలు చల్లుతూ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.."తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ ప్రజా ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుంది. ఈనెల 26 నుంచి మొదలుకానున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గ్రామసభల్లో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎంపిక చేస్తారు. లబ్ధిదారుల జాబితా ఎక్కడో తయారు కాదు. ఇందులో అపోహలు, అనుమానాలు పెట్టుకోకండి. గ్రామసభలోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ప్రజా పాలనలో ప్రజలందరి సమక్షంలోనే నిర్ణయాలు తీసుకుంటాం. గ్రామ సభలు నిర్వహించి సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను తయారు చేస్తారు. ఎర్రుపాలెంలో 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం. అలాగే చెరువులు, అడవులను రక్షించుకుంటూ ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తాం.

టూరిజం అభివృద్ధితో ఎర్రుపాలెం మండల ప్రజల ఆదాయ వనరులు, జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రజా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తోంది. ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో అర్బన్ పార్క్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టాం. త్వరలోనే ఇనీధ్రంపేట చెరువులను ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాంతాల విశిష్టతను అంతర్జాలంలో పొందుపరిచి వీకెండ్‌లో అత్యధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.

బనిగండ్లపాడులో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను పునర్నిర్మించి పూర్వ వైభవం తీసుకువస్తాం. బనిగండ్లపాడుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జూనియర్ కాలేజీ తీసుకువచ్చి మాజీ మంత్రివర్యులు శీలం సిద్ధారెడ్డి గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చారు. కట్టలేరుపై బ్రిడ్జి నిర్మిస్తాం. మధిర లింకు రోడ్డు ఎర్రుపాలెం నుంచి బనిగండ్లపాడుకు రోడ్డు విస్తరించి బనిగండ్లపాడును సెంటర్ పాయింట్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. బనిగండ్లపాడులో నూతనంగా ప్రారంభించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎర్రుపాలెం 50 పడకల ఆస్పత్రితో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని" చెప్పారు.