సీటు కోసం పోటీ
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పై ప్రధాన పార్టీలో ఫోకస్ పెట్టాయి. మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. నవంబర్ లో కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నికను పూర్తి చేయనుంది. బీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉపపోరులో విజయాన్ని ఈ ఎన్నికలోనూ పునరావృతం చేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ నుంచి ఈ సారి ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో ఆశావాహులు రేసులో ఉన్నారు. 2023లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన అజారుద్దీన్, తిరిగి తనకే టికెట్ ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే, సీఎం రేవంత్ మాత్రం అభ్యర్ధి ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని చెబుతున్నారు. కాగా, ఇక్కడ ఎంఐఎం పోటీ గెలుపు ఓటముల్లో కీలకంగా మారనుంది.
రేవంత్ ఛాయిస్
అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ఫయీమ్ ఖురేషి, రాములు నాయక్, అంజన్ కుమార్ యాదవ్, మైనంపల్లి హనుమంతరావు, బండి రమేశ్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి పోటీకి సిద్ధమంటూ పీసీసీకి సంకేతాలు పంపిస్తు న్నారు. అటు బీఆర్ఎస్ కు ఈ ఉప ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాల్లో ఫలితాలు ప్రతికూలంగా వచ్చినప్పటికీ, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం అనుకూల ఫలితాలు వచ్చాయి. అనారోగ్యంతో మరణించిన మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నుంచి వరుసగా మూడుసార్లు 2014, 2018, 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. మొదట తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన ఆయన, తర్వాత గులాబీ పార్టీలో విలీనమై పోటీ చేసి గెలుపొందారు.
బీఆర్ఎస్ అభ్యర్దిగా
ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తమ అభ్యర్దిగా గోపీనాథ్ కుటుంబ సభ్యులను బరిలోకి దించాలని దాదాపు నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే ఈ మేరకు చర్చలు చేసినట్లు తెలుస్తోంది. రాజధానిలో బీఆర్ఎస్ బలంగా ఉందని, ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉంటుందని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో జరుగుతున్న ఉప ఎన్నికలో పార్టీ అభర్థిని గెలిపించుకోవడం గులాబీ పార్టీకి అవసరంగా మారుతోంది. మాగంటి కుటుంబానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దాసోజు శ్రవణ్‌లకు నియోజకవర్గ సమన్వయ బాధ్యతలను అప్పగించారు. మాగంటి సతీమణి సునీత పార్టీ సభలకు హాజరవుతున్నారు. అటు బీజేపీ సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై గురి పెట్టినట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన మద్దతు ఇక్కడ తీసుకునేలా బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, జూబ్లీహిల్స్ బై పోల్ ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
Social Plugin